- పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం ఉదయం ఓ ఎన్నారైపై కాల్పులు
-
ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు.
బాధితుడు 43 ఏళ్ల సుఖ్‌చైన్ సింగ్‌గా గుర్తింపు -
ఏం చేయవద్దని ప్రాధేయపడ్డ తల్లి.. పిల్లలు -
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం ఉదయం ఓ ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎన్నారైపై రెండుసార్లు కాల్పులు జరిపారు. బాధితుడు 43 ఏళ్ల సుఖ్‌చైన్ సింగ్‌గా గుర్తించారు. కాగా.. ఇటీవలే అతను అమెరికా నుంచి సొంతూరు డబుర్జి గ్రామానికి వచ్చాడు. కాగా.. ఎన్నారై హోటల్, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం గాయపడిన ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం ప్రకారం.. అతను జిమ్‌కు వెళ్లే ముందు తలపాగా ధరించిన ఇద్దరు సాయుధ వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. వారు గన్ చూపించి వాగ్వాదానికి దిగారు.. అనంతరం ఎన్నారైపై దాడికి పాల్పడ్డారు.
వీడియోలో.. అతడిని ఏం చేయవద్దని అతని తల్లి, పిల్లలు నిందితులకు చేతులు జోడించి వేడుకున్నారు. అయితే సుఖ్‌చైన్ సింగ్‌ను బలవంతంగా బెడ్రూమ్లోకి తీసుకెళ్లేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో తల, మెడపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుఖ్‌చైన్ సింగ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్‌చైన్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అత్త వారింటికి సంబంధించిన ఆస్తి వివాదం వల్ల స్థానిక గ్యాంగ్ సభ్యులు అతడిపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.