- చెరువుల పక్కనే ఫామ్‌హౌస్‌లు
- చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం
- అక్రమ కట్టడాలకు స్ఫూర్తి భగవద్గీతే

Hyderabad Ponds Encroachments: ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని, చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామన్నారు. కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించారని, వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారన్నారు. హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం పేర్కొన్నారు. హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు.
‘హైదరాబాద్ లేక్ సిటీ, గండిపేట, ఉస్మాన్ సాగర్.. హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు విలాసాల కోసం చెరువుల పక్కనే ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. ఆ ఫామ్‌హౌస్‌ల నుంచే వచ్చే డ్రైనేజీ నీరును చెరువుల్లో కలుపుతున్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. ఒత్తిడి వచ్చినా.. మిత్రులకు ఫామ్‌హౌస్‌లు ఉన్నా వదలం. అక్రమణదారుల చర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. అక్రమ కట్టడాలకు స్ఫూర్తి భగవద్గీతే. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు నాకు స్ఫూర్తి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
‘రాజకీయం కోసమే.. నాయకులపై కక్ష్య కోసమే కూల్చివేతలు చేయడం లేదు. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే.. నేను ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్లే. శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారున్నారు, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు, సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండవచ్చు.. వారెవరిని పట్టించుకోను. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.