- కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొనసాగుతున్న ఉద్రిక్తత..
-
నేడు కోల్కతా సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు.. -
సచివాలయం వద్ద ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పిన బెంగాల్ పోలీసులు..

Kolkata Murder Case: కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు ఇవాళ (మంగళవారం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయం (నవన్ అభియాన్) ముట్టడికి పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ఛత్ర సమాజ్ అనే సంస్థ బ్యానర్‌పై ఈ ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
మంగళవారం నవన్ అభియాన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 5,000 వేల మంది పోలీసులను మోహరించారు. ఐజీ, డీఐజీ స్థాయిలోని 21 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక భద్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో పాటు 13 మంది ఎస్పీ, డీఎస్పీలు, 15 మంది ఏసీపీలు, ఏఎస్పీలను కూడా నియమించారు. ఇదిలా ఉండగా నేడు జూనియర్ల డాక్టర్ల సచివాలయ ముట్టడి పిలుపునివ్వడం చట్ట విరుద్ధం అని పోలీసులు ప్రకటించారు. ఇక, బెంగాల్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర సచివాలయం దగ్గర నిరసన తెలిపేందుకు ఏ సంస్థ దరఖాస్తు చేసుకోలేదు అన్నారు. కొందరు దుండగులు ప్రచారం ముసుగులో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని మాకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది అని తెలిపారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నదే మా ప్రయత్నం అని బెంగాల్ డీజీపీ తెలిపారు. ఈ ముట్టడికి పిలుపునిచ్చిన సంస్థ అధికారికంగా ఉనికిలో లేదన్నారు. కాగా, మరోవైపు ర్యాలీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఆమోదం లభించలేదని విద్యార్థి సంఘాలు తెలిపాయి.