Leading News Portal in Telugu

Rohan Jaitley-BCCI: బీసీసీఐ కార్యదర్శి పోస్ట్.. రోహన్ జైట్లీ ఏమన్నారంటే?


  • ఐసీసీ ఛైర్మన్‌గా జై షా
  • బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ
  • తండ్రి లాగే రోహన్‌ కూడా న్యాయవాది
Rohan Jaitley-BCCI: బీసీసీఐ కార్యదర్శి పోస్ట్.. రోహన్ జైట్లీ ఏమన్నారంటే?

Rohan Jaitley About BCCI Secretary Post: ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అందుకోవడం లాంఛనమే. నామినేషన్‌ వేయడానికి నేడు ఆఖరు తేదీ కాగా.. షాకు ఏకంగా 15 మంది (16 మందిలో) మద్దతు ఉంది. ఐసీసీ ఛైర్మన్‌గా షా వెళితే.. బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పదవి రేసులో చాలామంది ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. ఇందులో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు (డీడీసీఏ) రోహన్‌ జైట్లీ కూడా ఉన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా రోహన్‌ బాధ్యతలను చేపడతారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.

బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలను చేపడతానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రోహన్‌ జైట్లీ ఖండించారు. నెట్టింట వస్తున్న వార్తలన్నీ తప్పుడు కథనాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఢిల్లీ ప్రిమియర్‌ లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు. దివంగత బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తనయుడే ఈ రోహన్. తండ్రి లాగే రోహన్‌ కూడా న్యాయవాది. నాలుగేళ్ల కింద డీడీసీఏ అధ్యక్షుడిగా అతడు ఎన్నికయ్యారు.