కవితకు బెయిలుపై రాజకీయ రచ్చ! | political upheaval on bail to kavitha| brs| bjp| congerss| unnecessary| war
posted on Aug 28, 2024 2:06PM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బెయిలు అనూహ్యమైనదేమీ కాదు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం బెయిలు మంజూరు చేసిన రోజు నుంచీ ఇహనో ఇప్పుడో కవితకు కూడా బెయిలు లభిస్తుందన్నఅంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుప్రీం కోర్టు మంగళవారం (ఆగస్టు 27) బెయిలు మంజూరు చేసింది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు.
అయితే కవితకు బెయిలు మంజూరు కావడంపై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. కవితకు బెయిలు మంజూరు చేసింది సుప్రీం కోర్టు అన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తూ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం నిందలు మోపుకుంటూ రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీల విలీనం ఫైనలైజ్ అయ్యింది కనుకనే కవితకు బెయిలు వచ్చిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తే.. బీజేపీ కాంగ్రెస్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ ద్వారా కవితకు బెయిలు వచ్చేలా చేసిందని ప్రత్యారోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టింది. కవిత అరెస్టే అన్యాయమని చెబుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సమర్థనల సంగతి ఎలా ఉన్నా ఐదు నెలలకు పైగా జైలులో ఉన్న కవిత బెయిలుపై విడుదల కావడం ఆమెకూ, బీఆర్ఎస్ కూ కూడా భారీ ఊరటే అనడంలో సందేహం లేదు.
అన్నిటికీ మించి కవితకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చార్జి షీట్ దాఖలు కావడం, ఈబీ సీబీఐ దర్యాప్తు పూర్తికావడాన్ని కారణంగా చెబుతూ బెయిలు మంజూరు చేసింది. ఒక మహిళను ఇన్ని రోజులు జైలులో ఉంచడం సబబు కాదని వ్యాఖ్యానించింది. అయినా కూడా ఆమెకు షరతులతో కూడిన (కండీషన్డ్) బెయిలు మాత్రమే మంజూరు చేసింది. అలాగే సెల్ ఫోన్లో మెసేజీలు తొలగించడం తప్పు కాదని పేర్కొంది. సెక్షన్ 45 మేరకు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. కేవలం అప్రూవర్లు బుచ్చిబాబు ,మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే పట్టించుకుంటారా అని ఈడీని ద్విసభ్య ధర్మాసనం చివాట్లు పెట్టింది. ఆ అప్రూరవర్లు మొదట సీసోడియా పాత్రధారి,క్రేజీవాల్ పాత్రధారి అన్నారని, ఇప్పుడు కవిత సూత్రధారి అంటున్నారనీ సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కవిత నిందితురాలు అనడానికి మీ వద్ద ఉన్న ఆధారాలేమిటని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది.
ఇక కవితకు బెయిలు వస్తుందని ముందుగానే తెలిసి కేటీఆర్, హరీష్ రావులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారని వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ ఖండించింది. కవితకు బెయిలు మంజూరు కాకుంటే.. ఢిల్లీలో ధర్నా చేసి మరీ బీజేపీ నిజస్వరూపాన్ని బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే తాము హస్తినకు వెళ్లామని బీఆర్ఎస్ చెబుతోంది. మొత్తం మీద జైలులో రెండు సార్లు ఆనారోగ్యంతో బాధపడినా బెయిల్ లభించని కవితకు సుప్రీంకోర్టు జోక్యంతో లభించడం గమనార్హం.
కాగా కవితకు బెయిలు మాత్రమే మంజూరైందనీ, కేసు ఇంకా అలాగే ఉందన్న విషయాన్ని కవిత, బీఆర్ఎస్ గుర్తుంచుకోవాలి. కేసుల్లో బెయిల్ రావడం అన్నది సాధారణమని తెలుసుకోవాలి. ఇంత కాలంగా కవిత కు బెయిల్ రాకపోవడంపై ఆనేక ఊహాగానాలు చెలరేగాయి. ఇప్పుడు బెయిలు రావడంపై మరిన్ని ఊహాగాన సభలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో కవిత పాత్ర ఏమిటన్నది దర్యాప్తులో చేరుతుంది. ఈ లోగానే బెయిలు విషయంలో రాజకీయ రచ్చ అనవసరమని పరిశీలకులు అంటున్నారు.