posted on Aug 28, 2024 6:03PM
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు ఇలా అనుమతి ఇచ్చిందో లేదో అలా వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోయారు. దీంతో వైసీపీని ఇక నుంచి బైబై వైసీపీ అని పిలవాల్సి ఉంటుందేమో? అని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతుండటమే అందుకు కారణం. తాజాగా వైసీపీ నుంచి ఓ ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక మండలి సభ్యురాలు బయటకు వెళ్లిపోవడం ఖరారైంది. మండలి సభ్యురాలు పోతుల సుజాత ఇప్పటికే రాజీనామా చేయగా, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు గురువారం (ఆగస్టు 29) వైసీపీకి రాజీనామా చేయనున్నారు. అలాగే రాష్ట్రపతిని కలిసి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు.
వీరే కాకుండా మరో మరో నలుగురు ఎంపీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని వైసీపీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ దేశం దాటిన తరువాత వారంతా బయటకు వస్తారని అంటున్నారు. ఈ లోగా గురువారం (ఆగస్టు 28) మోపిదేవి, బీదలు రాష్ట్రపతిని కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యులుగా వారు రాజీనామా చేయనున్నారు. వీరిరువురూ తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు సమాచారం.