Leading News Portal in Telugu

Kolkata Doctor case: కోల్‌కతా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై ఐఎంఏ సస్పెన్షన్ వేటు..


  • కోల్‌కతా కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్‌పై ఐఎంఏ సస్పెన్షన్..

  • సందీప్ ఘోష్‌ని సస్పెండ్ చేస్తూ మెడికల్ బాడీ నిర్ణయం..

  • డాక్టర్ హత్యాచార ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘోష్..
Kolkata Doctor case: కోల్‌కతా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై ఐఎంఏ సస్పెన్షన్ వేటు..

Kolkata Doctor case: కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో కాలేజీ సెమినార్ హాలులో అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లతో పాటు మహిళలు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

డాక్టర్ ఘోష్ తన చర్యల ద్వారా వృత్తికి చెడ్డపేరు తెచ్చారని మరియు క్రమశిక్షణా కమిటీ అతన్ని జాతీయ వైద్య సంఘం సభ్యత్వం నుండి “వెంటనే” సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని ఐఎంఏ ప్రకటనలో పేర్కొంది. ఇదే కాకుండా హత్యాచార పరిస్థితిని ఎదుర్కొనే విషయంలో మీరు బాధితురాలి తల్లిదండ్రులకు మనోవేదనను పెంచారు, అలాగే సమస్యనున సముచితంగా నిర్వహించడంలో సానుభూతి, సున్నితత్వం లేదని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉంటే ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, ఘటన జరిగిన సమయంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌ని విచారించింది. కాలేజ్‌కి బాధ్యుడి, విద్యార్థులకు రక్షణగా నిలవాల్సిన సందీప్ ఘోష్ ఈ అత్యాచారం, హత్య ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు ఆరోపనలు ఉన్నాయి. వైద్యురాలు ఘటన తర్వాత అతడు, ఆమె తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పినట్లు సమాచారం. అంతే కాకుండా బాధితురాలి తల్లిదండ్రుల్ని ఆమె మృతదేహాన్ని చూడటానికి అనుమతించేందుకు 3 గంటల పాటు వేచిచూసేలా చేశాడు. ఈ ఘటన నేపథ్యంలో సందీప్ ఘోష్ వైఖరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఘటన జరిగిన తర్వాత ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టు నుంచి తొలగించి, వేరే కాలేజీలో ఇదే స్థాయి పోస్టులో అపాయింట్మెంట్ చేయడాన్ని కలకత్తా హైకోర్టు తప్పు పట్టింది. ఇలాంటి వ్యక్తిని, విచారణ జరుగుతున్న సమయంలో ఎందుకు వేరే చోట నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వెంటనే అతడిని ఆ పోస్టు నుంచి తొలగించి, సెలవులపై పంపాలని మమతా బెనర్జీ సర్కారుని ఆదేశించింది.