Leading News Portal in Telugu

పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం | union cabinet green signal to release polavaram funds| includinf. pending| first


posted on Aug 28, 2024 4:47PM

ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్.  రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం ఇక ఏ అడ్డంకులూ లేకుండా సాఫీగా సాగనుంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం  నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న నిధులనే కాకుండా ప్రాజెక్టు నిర్మాణం సత్వరంగా పూర్తి కావడానికి అవసరమైన నిధులను కూడా ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం (ఆగస్టు 28) జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పోలవరం మొదటి దశ నిర్మాణానికి 12వేల 500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. అలాగే ఇాప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది.

జగన్ హయాంలో గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా నిలిచిపోయాయి. దానికి తోడు నిర్వహణ కూడా లేకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. సజావుగా సాగుతున్న పోలవరం నిర్మాణాన్ని జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే ముంపు బాధితుల పరిహారం నిధులను కూడా పక్కదారి పట్టించింది. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో  పనులు జోరందుకున్నాయి. సీఎం చంద్రబాబు కూడా పోలవరం, అమరావతి నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక దృష్టి సారించారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి పర్యటన పోలవరం సందర్శనే కావడమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటన్నది అవగతమౌతుంది.