Leading News Portal in Telugu

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. తీవ్రత 5.7గా నమోదు, భారత్లోనూ ప్రకంపనలు


  • ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం
  • ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
  • భూకంపం కారణంగా పాకిస్తాన్.. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు
  • ఉదయం 11:26 గంటలకు భూకంపం
  • రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. తీవ్రత 5.7గా నమోదు, భారత్లోనూ ప్రకంపనలు

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో కాకుండా.. భారత కొంచెం దగ్గరగా ఉంటే, భారీ నష్టం జరిగే అవకాశం ఉండేది.

నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. ఈ భూకంపం యొక్క కేంద్రం భూమికి 255 కిలోమీటర్ల దిగువన ఉంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని అష్కాషామ్‌కు 28 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ఆ కారణంగా.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కూడా తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. అయితే.. భారతదేశంలో తీవ్రత చాలా తక్కువగా ఉన్నందున కొంతమందికి భూకంపం గురించి తెలియదు. ఆఫ్ఘనిస్థాన్‌కు ఆనుకుని ఉన్న పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. అయితే భూకంపం కారణంగా.. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.

భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని.. అయితే ఉపరితలంపై అంతగా ప్రభావం చూపలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 255 కిలోమీటర్ల దిగువన ఉండటమే ఇందుకు కారణం అని పేర్కొంది. సాధారణంగా రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈసారి ఎక్కువ లోతు కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు. అలాగే.. భారతదేశంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో చాలా చిన్న ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లో తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. భూకంప కేంద్రం కాబూల్‌కు ఈశాన్యంగా 277 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్, భారతదేశానికి భూకంపం ప్రభావం చాలా తక్కువగా ఉంది.