- వచ్చే నెలలో అబుదాబి యువరాజు భారత్ లో పర్యటన
-
సెప్టెంబర్ 8న భారత్కు షేక్ ఖలీద్ -
ప్రధాని మోడీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం.

అబుదాబి యువరాజు ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెల (సెప్టెంబర్)లో భారత్లో పర్యటించనున్నారు. కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. పర్యటనలో భాగంగా.. భారతదేశం-యుఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్కు వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ పర్యటనపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఈ పర్యటనలో.. అబుదాబి యువరాజు ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారు. ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్తు సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించనుంది. “భారత్, యుఏఈ మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. ఈ పర్యటనలో ఆ పునాదిని మరింత బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దాల కోసం ఎదురుచూడడం, యుఏఈ భవిష్యత్తు నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి సారించనున్నట్లు ఒక అధికారి తెలిపారు.
పశ్చిమాసియాలోని కీలక శక్తులతో సన్నిహిత భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి మోడీ ప్రభుత్వం కృషి చేయడంతో 2015 నుంచి యూఏఈని ఏడుసార్లు సందర్శించారు. MBZగా ప్రసిద్ధి చెందిన UAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చివరిసారిగా 2023 సెప్టెంబర్ లో భారతదేశ పర్యటనకు వచ్చారు.