Leading News Portal in Telugu

Barinder Sran: రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత పేసర్‌!


  • రిటైర్మెంట్‌ ప్రకటించిన బరీందర్‌ శ్రాన్‌
  • ధోనీ నాయకత్వంలో జింబాబ్వేపై అరంగేట్రం
  • తొలి టీ20 మ్యాచ్‌లో 4 వికెట్లు
Barinder Sran: రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత పేసర్‌!

Barinder Sran Retirement: టీమిండియా పేసర్‌ బరీందర్‌ శ్రాన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. 31 ఏళ్ల శ్రాన్‌ భారత్‌ తరఫున ఆరు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. వన్డేల్లో ఏడు వికెట్లు, టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 2016 జూన్‌ 20న ఎంఎస్ ధోనీ నాయకత్వంలో జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు. తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన రికార్డు బరీందర్‌ పేరిటే ఉంది.

ఐపీఎల్‌లో బరీందర్‌ శ్రాన్‌ నాలుగు జట్లకు ఆడాడు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2019లో ముంబై ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో బరీందర్‌ సభ్యుడు. 2015-2019 మధ్య మొత్తం 24 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 9.40 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. దేశీయ స్థాయిలో 137 వికెట్లు తీశాడు. చివరగా 2019లో ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌, 2021లో లిస్ట్-ఎ మ్యాచ్ ఆడాడు.