- దేశంలోని జలాశయాల్లో గణనీయంగా పెరిగిన నీటి నిల్వలు..
-
గతేడాదితో పోల్చితే ఈసారి 126 శాతం అధికం: కేంద్ర జలసంఘం వెల్లడి

Water Level in Reservoirs: భారత దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగిపోయాయి. గత సంవత్సరం ఇదే టైంతో పోల్చితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు 126 శాతం అధికంగా నమోదైనట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది. 10 ఏళ్ల సగటుతో పోల్చితే నీటి నిల్వ స్థాయిలు 119 శాతం పెరిగినట్లు పేర్కొనింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 29వ తేదీ వరకు రిజర్వాయర్లలో నీటిమట్టం 144.333 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) దగ్గర ఉందని.. మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 80 శాతం అని సీడబ్ల్యూసీ వెల్లడించింది. 20 జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు ఉన్న 155 జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 180.852 బీసీఎంలుగా ఉంది.
ఇక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కూడిన దక్షిణాదిలోని 43 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగినట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. వీటిల్లో మొత్తం 44.771 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నీటి నిల్వ ఉన్నట్లు సీడబ్ల్యూసీ చెప్పుకొచ్చింది. ఈ జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది 82 శాతంగా ఉంది.. గతేడాది ఇదే సమయానికి ఈ జలాశయాల్లో 49 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉండగా.. ఇక సాధారణ నిల్వల స్థాయి 63 శాతమే ఉన్నాయి.