- గూగుల్ పేలో యూపీఐ సర్కిల్ ఫీచర్
- గరిష్ఠంగా యూపీఐని ఐదుగురు పంచుకోవచ్చు
- యూపీఐ లైట్‌లో ఆటోపే ఆప్షన్

UPI Circle Option in Google Pay: ప్రముఖ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్ పే.. యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఓ వ్యక్తి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయం ఉంటుంది. అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ముంబై వేదికగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో భాగంగా యూపీఐ సర్కిల్‌తో పాటు మరికొన్ని ఫీచర్లను గూగుల్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్న ఓ వ్యక్తి తమ మొబైల్‌లో యూపీఐ సేవలను వాడుకునే వీలుంది. ఇప్పుడు ఎవరి యూపీఐని వారే వాడుకుంటున్నారు. ఈ యూపీఐని మరొకరు వాడేందుకు వీల్లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్‌తో.. మరొకరు కూడా మీ అకౌంట్‌ను వాడుకోవచ్చు. ప్రైమరీ యూపీఐ అకౌంట్‌ను కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారితో పంచుకునే వెసులుబాటును గూగుల్ కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్‌ను వేరొకరు వినియోగించి.. లావాదేవీలు చేసుకోవచ్చు. గరిష్ఠంగా మీ యూపీఐని ఐదుగురు పంచుకోవచ్చు. యూపీఐ సర్కిల్ కోసంఎన్‌పీసీఐతో గూగుల్ పే జట్టు కట్టింది.
ఈ-రూపీ సేవలను కూడా గూగుల్ ఆవిష్కరించింది. రూపే కార్డులు కలిగి ఉన్న వారికి ట్యాప్ అండ్ పే పేమెంట్స్ సదుపాయం కూడా ప్రకటించింది. దాంతో రూపే కార్డు హోల్డర్లు మొబైల్ ద్వారా ట్యాప్ చేసి.. పే చేయొచ్చు. మరోవైపు యూపీఐ లైట్‌లో ఆటోపే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్న విషయం తెలిసిందే.