- గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీకి సెలవులు..
-
ఇవాళ.. రేపు హాస్టల్ విద్యార్థులకు సెలవు ప్రకటించిన యాజమాన్యం.. -
సమస్య పరిష్కారం కాకపోతే బుధవారం నుంచి సమ్మె యోచన.. -
ఎస్పీ కామెంట్స్‌తో మరింత పెరిగిన ఉద్రిక్తత.. -
మంగళవారంలోగా సమస్య పరిష్కరిస్తామన్న మంత్రి కొల్లు.. -
మంత్రి కొల్లు హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమణ.. -
ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తరలించే ప్రయత్నంతో మరోసారి ఉద్రిక్తత..

Gudlavalleru Engineering College Incident: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. స్పాట్‌కు వచ్చిన ఎస్పీ గంగాధర్ మొత్తం సంఘటనా స్ధలాన్ని పరిశీలించకుండానే అక్కడ ఎలాంటి కెమెరాలు లేవనడం పై విద్యార్ధినులు సీరియస్ అయ్యారు.. అయితే వార్డెన్‌ను కూడా విచారించిన పోలీసులు తమ వాదనను మార్చడం.. కెమెరాల అంశం పై పూర్తి దర్యాప్తు జరుగుతుందనడంపై అనుమానాలు వ్యక్తం చేసారు విద్యార్ధినులు. ఇక, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ కలిసి సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు.. టెక్నికల్ టీంను ఏర్పాటు చేశామని.. పూర్తి విచారణ జరిపిన అనంతరం దీనిపై ఒక నిర్ధారణకు వస్తామని తెలిపారు.. మహిళా సిబ్బందితోనే విచారణ చేపట్టామని తెలిపారు కలెక్టర్. అసలు విద్యార్ధినుల హాస్టల్ కి కెమెరాలు ఎలా వెళ్ళాయి అనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. అయితే.. కళాశాల యాజమాన్యం పూర్తిగా ఆ విషయాన్ని పక్కన పెట్టేయడమే కాకుండా తమను బెదిరించారని ఆరోపించారు విద్యార్ధినులు.. ఈ ఆందోళనలకు విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సైతం తోడవడంతో పరిస్ధితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఘటనపై చర్యలకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. అధికారులను, జిల్లా మంత్రి కొల్లు రవీంద్రను అక్కడికి వెళ్లాలను సూచించారు. సీఎం ఆదేశాలతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంఎల్ఏలు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. వచ్చే మంగళవారం లోగా న్యాయం చేస్తామని విద్యార్ధినులకు హామీ ఇచ్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి కొల్లు, ఐదు హామీలతో కూడిన పత్రాన్ని యాజమాన్యం నుంచి విద్యార్థినులకు అందజేశారు. మంత్రి చొరవతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు విద్యార్ధినులు. కళాశాలలోనే విచారణ జరుగుతుండగా.. మహిళా కమిషన్, స్థానిక అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఈ కెమెరాల అంశంపైన పూర్తి విచారణ జరపాలని మహిళా కమిషన్ అధికారులను ఆదేశించింది.. దీనిపై అవసరమైతే హైకోర్టుకు వెళతామని తెలిపింది. అటు ఘటనపైన విచారణ జరుగుతుండగా వైసీపీ నేతలు పేర్ని కిట్టు, జడ్పి చైర్ పర్సన్ హారిక, ఎంఎల్సీ వరుదు కళ్యాణి కళాశాలకు రావడంతో మరోసారి వాతావరణం వేడెక్కింది. లోనికి అనుమతించకపోవడంపై వైసీపీ శ్రేణులు రెండు గంటలకు పైగా మెయిన్ గేటు వద్ద ఆందోళన చేసారు. పోలీసులు సర్ది చెప్పడంతో వెళ్ళిపోయారు వైసీపీ శ్రేణులు.
అంతా సర్దుమణిగింది అనుకునే లోపే.. విద్యార్ధిని, వార్డెన్‌లను పోలీసులు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయడంతో మరోసారి కళాశాలలో వాతావరణం వేడెక్కింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా మంగళవారం లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయినా విద్యార్ధినులు కళాశాలలో స్ట్రైక్ చేసేటందుకు సిద్ధమవుతుండటంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. అయితే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.. నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించిన విద్యార్ధినులు.. రాత్రికి రాత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్ధినిని తరలించే ప్రయత్నం పోలీసులు, అధికారులు చేయడంతో.. మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది.. విద్యార్ధినులు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు అధికారులు.. ఈ రోజు మళ్లీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.. ఎంత ఆందోళన చేస్తున్నా… ఇంకా ఎటువంటి కెమెరాలు లేవని ప్రచారం చేస్తున్నారంటున్న విద్యార్ధినులు.. తలిదండ్రులు వస్తేనే ఇళ్ళకు పంపుతామనడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విద్యార్ధినులు.. మరోవైపు.. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.. ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి.. కాలేజి విజిట్ కు వస్తారని, అందుకు తగ్గ ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.