ఎమ్మెల్యే యార్లగడ్డ.. ముంపు బాధితులకు అన్నదాత | GANNAVARAM MLA YARLAGADDA IN SERVICE TO FLOOD VICTIMS| TELUGU| YUVATHA| NARESH| TOUR| EFFECTED| AREAS| DISTRIBUTE
posted on Sep 3, 2024 9:04AM
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా విజయవాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. విజయవాడ నగరంతోపాటు.. గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. స్థానికంగా కురుస్తున్న వర్షానికితోడు.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా బుడమేరు, కృష్ణా నదులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాలన్నీ వదర నీటిలో మునిగిపోయాయి.. వరదల తీవ్రతను ముందే అంచనా వేసిన సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు.
ఆదివారం ఉదయం నుంచే ఆయన స్వయంగా రంగంలోకిదిగి విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద ముంపులో ఉన్న ప్రతిఒక్కరికి ఆహారం, తాగునీరు అందేలా అధికారులకు ఆదేశిస్తూ.. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశిం చడమే కాకుండా, వరద బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాలను క్షణం క్షణం పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా వరద ముంపు ప్రాంతాలలో బోటులో పర్యటించి మరీ ముంపు బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన గ్రామాల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మోకాళ్లలోతుకుపైగా నీళ్లలోనూ ముంపు ప్రాంతాలకు వెళ్లి మరీ బాధితులకు ధైర్యాన్ని చెబుతూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలోని ముంపు గ్రామాలకు వెళ్లే దారిలో ఉన్న సింగ్ నగర్, గన్నవరం రూరల్ మండలం అంబాపురంలను వరదనీరు ముంచెత్తింది.
మోకాళ్లలోతుకుపైగా నీళ్లలోనే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అంబాపురం గ్రామానికి చేరుకుని ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఓ అపార్మెంట్ మెుదటి అంతస్తు వరకూ వరదనీరు చేరిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని వీధుల్లో భారీ వరదతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కారు. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలంటూ అధికారులను కోరారు. అయితే, వారి నుంచి సరియైన సమాధానం రాకపోవటంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తెలుగుయువత అధ్యక్షుడు పరుచూరి నరేష్, తెలుగుయువత సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే యార్లగడ్డ స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక సర్పంచ్ సీతయ్యతో కలిసి ట్రాక్టర్ల సహాయంతో గ్రామంలోని సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వయోవృద్ధులు, పేసెంట్లు ఉండటంతో జేసీబీల సహాయంతో వారిని గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు స్థానికుల సహాయంతో ఎమ్మెల్యే తీవ్రంగా శ్రమించారు. కానీ, వరద ఉధృతి అంతకంతకు పెరగడంతో జేసీపీ కూడా ముంపు గ్రామానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా వెనక్కు తగ్గకుండా ఓ పక్క ముంపు బాధితులకు భరోసా ఇస్తూనే మరో పక్క వారికి భోజన ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకూ దాదాపు 40 వేల మందికి పైగా అహారం అందించారు. ఆ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వరద ముంపు నుంచి గ్రామాలు బయటపడి, వరద బాధితులు సాధారణ జీవనం గడిపే వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, నిరంతరాయంగా కొనసాగిస్తామని యార్లగడ్డ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరు పట్ల తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో అలవాటైన జడత్వం నుంచి అధికారులు ఇంకా బయటకు రాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి బాధితులను పరామర్శించి, వారికి భరోసా కల్పించి అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తరువాత మాత్రమే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందనీ, ఇంకా కొందరు అధికారులు మాత్రం సహాయ పునరావాల కార్యక్రమాల విషయంలో నెమ్మదిగానే కదులుతున్నారని యార్లగడ్డ విమర్శించారు.
అంబాపురం గ్రామం 1వ వార్డులో రెండుమూడు రోడ్లలో దాదాపు 14 నుంచి 15అడుగులకు మించి ఎత్తులో వరద నీరు ప్రవహించింది. చాలామంది డాబాపైకి వెళ్లారు. ఎమ్మెల్యే, అధికారులతోపాటు టీడీపీ శ్రేణులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. గన్నవరం మండలం ముస్తాబాద్, సావరగూడెం గ్రామాలు జలమయం అయ్యాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ ఆయా గ్రామాలకు చేరుకొని వారికి ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందించడంతోపాటు.. వారిని బోట్ల సహాయంతో సరక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. గన్నవరం మండలంలోని గొల్లనపల్లిలో చెరువులు ఉప్పొంగి ప్రవహించడంతో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఎమ్మెల్యే యార్లగడ్డ ఆయా ప్రాంతాలకు అతికష్టం మీద చేరుకొని అక్కడి బాధితులకు కూడా ఆహార ప్యాకెట్లు అందేలా చర్యలు తీసుకున్నారు. గన్నవరం నియోకవర్గంలో వరద ముంపు గ్రామాల్లోని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతీఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
శనివారం (ఆగస్టు 31) సాయంత్రం నుంచి నిర్విరామంగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృషి చేశారు. సోమవారం బోట్లు, ఎన్డీఆర్ ఎప్ సిబ్బంది రంగంలోకి దిగడంతో వారి సహాయంతో ముంపు ప్రాంతల్లోని ప్రజలను ఎమ్మెల్యే దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు.. వారికి సరియైన వసతి సౌకర్యాలు కల్పించేలా ఎమ్మెల్యే యార్లగడ్డ కృషి చేశారు. యార్లగడ్డతో పాటు పరచూరి నరేష్, తెలుగుయువత, తెలుగుదేశం కార్యకర్తలు వరద బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.