Leading News Portal in Telugu

Virender Sehwag: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నా వల్ల కాదు బాబోయ్: సెహ్వాగ్


  • 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు సెహ్వాగ్ వీడ్కోలు
  • 2017లో హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు
  • ఐపీఎల్‌లో ఆఫర్ వస్తే చేస్తా
Virender Sehwag: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నా వల్ల కాదు బాబోయ్: సెహ్వాగ్

Virender Sehwag Interested Coaching An IPL Team: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఆటగాడిగా ఇప్పటికే 15 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్నానని, కోచ్ పదవి చేపడితే మరోసారి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నాడు. ఐపీఎల్ టీమ్ కోచ్‌గా ఆఫర్ వస్తే మాత్రం వదులుకోనని వీరూ చెప్పాడు. 2017లో టీమిండియా హెడ్ కోచ్ పదవికి సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అప్పటి సీఏసీ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని నియమించింది. ఆ తర్వాత వీరూ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదు.

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారా? అనే ప్రశ్న వీరేంద్ర సెహ్వాగ్‌కు ఎదురైంది. సెహ్వాగ్‌ మాట్లాడుతూ… ‘టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టను. ఎందుకంటే నేను భారత జట్టుకు కోచ్‌గా మారితే మళ్లీ నా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే ఆటగాడిగా 15 ఏళ్ల పాటు ఇంటికి దూరమయ్యా. హెడ్ కోచ్ అయితే మరోసారి ఇదే రిపీట్ అవుతుంది. నాకు 14, 16 సంవత్సరాల పిల్లలున్నారు. ఇద్దరూ క్రికెట్ ఆడుతున్నారు. ఒకరు ఆఫ్ స్పిన్నర్, మరొకరు ఓపెనింగ్ బ్యాటర్. వారికి నా అవసరం ఉంది. నేను టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్తే వారిని ట్రైన్ చేయడం కష్టమవుతోంది. ఐపీఎల్‌లో కోచ్ లేదా మెంటార్ ఆఫర్ వస్తే చేస్తాను’ అని చెప్పాడు.

15 ఏళ్ల పాటు భారత జట్టుకు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2014, 2015లో పంజాబ్ కింగ్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన వీరూ.. 2016లో అదే జట్టులో కోచింగ్ స్టాఫ్‌లో మెంటార్‌గా చేరాడు. ఆపై డైరెక్టర్ ఆఫ్ ది క్రికెటర్‌గా 2018 వరకు కొనసాగాడు. అప్పటినుంచి వీరూ కోచ్, మెంటార్‌ పదవికి దూరంగా ఉంటున్నాడు. భారత్ తరఫున సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.