వరద సహాయ కార్యక్రమాలకు మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు | ministers escort vehicles in flood relief| nara| lokesh| prapose| ministers
posted on Sep 3, 2024 12:21PM
అధికారం అంటే హంగూ ఆర్భాటం కాదు, నిరాడంబరత, ప్రజా సేవ అని నిరూపిస్తున్నారు తెలుగుదేశం కూటమి మంత్రులు. కనీవినీ ఎరుగని రీతిలో వరద బెజవాడ నగరాన్ని జల దిగ్బంధం చేస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా, కూటమి ప్రభుత్వ మంత్రులంతా క్షేత్ర స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలలో భాగస్వాములై నిర్విరామంగా పని చేస్తున్నారు. బాధితులకు అండదండగా ఉంటామనీ, ఉన్నామనీ భరోసా కల్పిస్తున్నారు. ఓ వైపు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాలు పంచుకుంటూనే, మరో వైపు సమీక్షల్లో పాల్గొంటూ మరింత మెరుగైన సేవలు అందించే విషయంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇలాంటి ఓ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఐటీ, మానవవనరుల మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనకు మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
వరద పరిస్థితుల్లో మంత్రులంతా తమతమ ఎస్కార్ట్ వాహనాలను విత్ డ్రా చేసుకుని వాటిని బాధితులకు సహాయ పునరావాల కార్యక్రమాలకు వినియోగించాలని లోకేష్ చేసిన ప్రతిపాదనకు మంత్రులంతా క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపారు. దీంతో వరద నేపథ్యంలో మంత్రులంతా ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వారి ఎస్కార్ట్ వాహనాలు బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహారం, తాగునీరు, మందులు తరలించే వాహనాలకు ఎస్కార్ట్ గా ఉంటాయి. చివరి బాధితుడి వరకూ సాయం అందాలన్న చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా ఆయన కేబినెట్ మొత్తం పని చేస్తున్నది. ఇంతటి విపత్తులోనూ బాధితులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.