
Minister Ponguleti Srinivas Reddy: రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యాయని మంత్రి చెప్పారు. ఖమ్మం జిల్లాలోనే 49 వేల మంది ఉండగా. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 10,538 మందిని తరలించామని తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల 3039 మందిని రక్షించుకోగలిగామని మంత్రి వెల్లడించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటి వరకు 44 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా.. 600 ఇండ్లవరకు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ఇండ్లు పూర్తిగా కోల్పోయిన వారికి కొత్తగా మంజూరు చేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. 51 బ్రిడ్జిలు, 249 కల్వర్ట్స్, 166 ట్యాంక్‌లు దెబ్బతిన్నాయని, 13,342 జీవాలు మృతి చెందాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీటికి ఏ లోటు రావద్దని అధికారులను ఆదేశించారు.