Leading News Portal in Telugu

CS Shanti Kumari: ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలి..


CS Shanti Kumari: ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలి..

CS Shanti Kumari: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేయడంపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎస్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికీ అనేక జిల్లాల్లో వరదలు, వానలు తగ్గుముఖం పట్టలేదని సీఎస్ పేర్కొన్నారు.

జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్ర స్థాయికి పంపి, తగు జీపీఎస్ కోఆర్డినేట్‌లతో సహా సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు, సిబ్బంది, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలన్నారు. ఈ వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పలు జిల్లాల్లో వానలు, వరదలు పెను బీభత్సం సృష్టించాయి. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ఇతర జిల్లాల్లో వర్షాలు భారీగా కురిశాయి. పలు చెరువులకు గండ్లు పడి, ఆ నీళ్లు వాగుల్లో చేరి వంతెనలు తెగిపోయాయి. పలు చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల కిలోమీటర్ల మేర ఆర్​అండ్‌బీ రోడ్లు ధ్వంసమయ్యాయి.
కరెంట్ స్తంభాలు కూలడం, వైర్లు తెగిపడడం, విద్యుత్ సబ్‌స్టేషన్లలోకి నీళ్లు చేరడంతో ట్రాన్స్‌కోకు కూడా భారీ నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.