- వర్షాలతో అతలాకుతలమైన వారికి బీజేపీ అండగా నిలుస్తోంది
- కొట్టుకుపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్

Etela Rajender: భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు బీజేపీకి అండగా నిలుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంటలు బాగా దెబ్బతిన్నాయని.. కొట్టుకుపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని కోరారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో మొక్క జొన్న పంట చేతికి వచ్చే సమయంలో భారీగా దెబ్బతిన్నదని ఎంపీ వెల్లడించారు.
ఇల్లు కూలిపోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ వారికి ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. బీజేపీ కార్యకర్తలు బాధితులకు తోడుగా నిలుస్తారని ఈటల రాజేందర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా మోడీ ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.