Leading News Portal in Telugu

Pakistan Cricket: పాపం పాకిస్తాన్.. 3 సంవత్సరాలుగా విజయం లేదు!


  • బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘోర ఓటమి
  • సొంతగడ్డపై 10 టెస్టులు గెలవని పాకిస్తాన్
  • పాకిస్తాన్ చెత్త రికార్డు
Pakistan Cricket: పాపం పాకిస్తాన్.. 3 సంవత్సరాలుగా విజయం లేదు!

Pakistan Cricket Worst Record on Home Soil: బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. పాక్‌పై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌కు ముందు పాక్‌పై టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని బంగ్లా ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్‌ను దాని సొంతగడ్డపై 2-0తో చిత్తు చేసింది. తొలిసారి పాక్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్‌ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది.

గత మూడేళ్లలో పాకిస్థాన్ స్వదేశంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్‌పైనే పాక్ విజయం సాధించింది. గత మూడేళ్లలో పాక్ స్వదేశంలో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అన్నింటిలోనూ ఓడింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై పాక్ ఓడిపోయింది. స్వదేశంలో టెస్టు మ్యాచ్ గెలిచి 1,303 రోజులయ్యాయి. వరుస ఓటముల కారణంగా బాబర్ అజామ్‌ను టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి.. షాన్ మసూద్‌కు పగ్గాలు ఇచ్చింది పీసీబీ. ఇప్పుడు అతడి సారథ్యంలో కూడా బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను కోల్పోయింది.

టెస్టు క్రికెట్ చరిత్రలో చాలా కాలంగా సొంతగడ్డపై గెలవని చెత్త రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. ఘోర పరాజయాలను ఎదుర్కొంటున్న జింబాబ్వే.. స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచి 4002 రోజులు అయింది. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్థాన్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. అగ్ర జట్లలో పాక్ ప్రదర్శన మరీ దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం, ప్లేయర్స్ మధ్య గొడవలు, రాజకీయాలు.. లాంటివి జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపాయి. టాప్ బౌలింగ్, బ్యాటింగ్ ఉన్నా విజయాలు మాత్రం దక్కడం లేదు.