- రాహుల్ గాంధీతో వినేశ్ ఫొగాట్ భేటీ
- వినేశ్ రాజకీయ అరంగేట్రం ఖాయమేనా?
- 34 మంది అభ్యర్థులు ఖరారు

Vinesh Phogat Likely To Join Congress Ahead of Haryana Assembly Elections: భారత స్టార్ రెజ్లర్‌లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియాలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం కాశ్మీర్‌కు వెళ్లే ముందు రెజ్లర్లలతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లు వినేశ్, బజ్‌రంగ్‌లు రాహుల్‌తో సమావేశమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సోమవారం సమావేశం అయింది. ఎన్నికల్లో పోటీ చేసే 34 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు హరియాణా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు. నేడు అధికారికంగా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియాలు రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం గమనార్హం. వినేశ్, పునియాలను సెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని కాంగ్రెస్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలంపిక్స్ 2024లో అనర్హత వేటు పడటంతో వినేశ్ ఫొగాట్ స్వర్ణ కల చెదిరింది. భారమైన హృదయంతో ఆమె కుస్తీకి వీడ్కోలు పలికింది. ఇక వినేశ్ భవిష్యత్తు ఏంటని అనుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇక వినేశ్ రాజకీయ అరంగేట్రం ఖాయమే అని అందరూ అంటున్నారు. వినేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.