
Georgia : జార్జియాలోని ఓ పాఠశాలలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన బారో కౌంటీలోని అపాలాచీ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాల “హార్డ్ లాక్డౌన్” లో ఉంచారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనేక నివేదికల తర్వాత ఈ లాక్‌డౌన్ అమలులోకి వచ్చినట్లు పాఠశాల అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. అయితే, ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసులు, అంబులెన్స్‌లను మోహరించారు. ఒకరిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించగా, మరొకరి పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియలేదు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, నలుగురు వ్యక్తులు మరణించారు.. మరో నలుగురు గాయపడ్డారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన తర్వాత, పాఠశాల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి భారీగా బలగాలను మోహరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 1900 మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి తల్లిదండ్రులను కలిసేందుకు అనుమతించారు. ఘటనా స్థలానికి అనేక అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలను పంపించారు. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బిడెన్‌కు సమాచారం అందించినట్లు వైట్‌హౌస్ తెలిపింది.
జార్జియా గవర్నర్ ఏం చెప్పారు?
ఈ సంఘటనకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని రాష్ట్ర వనరులను మోహరించాలని జార్జియా గవర్నర్ బ్రియాన్ క్యాంప్ ఆదేశించారు. ఇది తీవ్రమైన పరిస్థితి.. అత్యవసర సేవలకు ఆటంకం కలిగించకుండా చూడాలని ప్రజలను అభ్యర్థించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరింత సమాచారం అందజేస్తామని అధికారులు తెలిపారు. ఇటువంటి సంఘటనలు సమాజంలో భయాందోళనల వాతావరణాన్ని సృష్టిస్తాయి. మనమందరం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలన్నారు.