Leading News Portal in Telugu

Kolleru Flood water: కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్


  • కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి..

  • నిన్నటి కంటే రెండు అడుగుల మేర పెరిగిన కొల్లేరు నీటి మట్టం..

  • 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. బిక్కు బిక్కుమంటున్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు..
Kolleru Flood water: కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్

Vijayawada Floods: కొల్లేరుకు బుడమేరు వాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే రెండు అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువ అయిందని అధికారులు చెప్తున్నారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కేవలం బోటు ద్వారానే కొల్లేరు పరిసర లంక గ్రామాల నుంచి పిల్లలు, వృద్ధులు బయటకు వస్తున్నారు. ఇక, ఏలూరు- కైకలూరు రోడ్డుపై నుంచి బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ఇంకా కొల్లెరుకు వరద నీటి ఉదృతి పెరుగుతుందనే నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వరద పెరిగితే మరిన్ని గ్రామాలు నీట మునిగి పోయే ప్రమాదం ఉంది. కొల్లేరు చుట్టూ ఉన్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.

అయితే, ఏలూరు- కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, కైకలూరు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి కైకలూరు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు తెలిపారు. చిన్న ఆడ్లగడ దగ్గర రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో భారీ వాహనాలకు మాత్రమే అక్కడి నుంచి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారు.

మరోవైపు, బుడమేరు దగ్గర గండి పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బండరాళ్లను తెచ్చి గండ్లను అధికారులు పూడుస్తున్నారు. 100 మీటర్ల మేర పడిన మూడో గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. 50, 60 మీటర్ల మేర పడిన రెండు గండ్లను ఇప్పటికే పూడ్చేశారు. ఇక, మూడో గండి పూడ్చివేత పనులను హైదరాబాద్ నుంచి వెళ్లిన ఆర్మీ అధికారులు పరిశీలించారు. వంతెన వేసి గండిని పూడ్చాలని ఆర్మీ డైరెక్షన్ ఇచ్చింది. బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల పర్యవేక్షణకు మూడు రోజుల నుంచి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మకాం వేశారు.