Leading News Portal in Telugu

Vinesh Phogat: రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కీలక ప్రకటన!


  • రైల్వేస్‌కు వినేశ్‌ రాజీనామా
  • కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
  • అభ్యర్థుల జాబితాలో వినేశ్‌ పేరు
Vinesh Phogat: రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కీలక ప్రకటన!

Vinesh Phogat To Joins Congress Today: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు శుక్రవారం ఎక్స్‌ వేదికగా తెలిపారు. రైల్వేకు సేవ చేయడం తన జీవితంలో ఓ మధుర జ్ఞాపకం అని, తాను మంచి సమయం గడిపానని చెప్పారు. దేశ సేవ కోసం తనకు ఇచ్చిన ఈ అవకాశంకు రైల్వేకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రైల్వే ఉన్నతాధికారులకు వినేశ్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు.

భారత స్టార్‌ రెజర్లు వినేశ్‌ ఫోగట్, బజరంగ్‌ పునియాలు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. త్వరలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బుధవారం కాంగ్రెస్‌ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీతో వినేశ్‌, పునియాలు భేటీ అయ్యారు. ఇక నేడు వినేశ్‌ రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అని స్పష్టమైంది.

వినేశ్‌ ఫోగట్, బజరంగ్‌ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు రాహుల్‌ గాంధీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఢిల్లీలో ఉన్నారట. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారని సమాచారం. హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను సీఈసీ ఇప్పటికే ఖరారు చేసింది. ఆ లిస్టులో ఇద్దరు రెజర్ల పేర్లు కూడా ఉన్నాయట.