Leading News Portal in Telugu

Jaggery Ganapati: గాజువాకలో 70 అడుగుల గణపతి.. 18 టన్నుల బెల్లంతో..


  • గాజువాకలో భారీ గణపతి..

  • 70 అడుగుల బెల్లం గణనాథుడు..

  • దాదాపు 18 టన్నుల బెల్లం వినియోగం..
Jaggery Ganapati: గాజువాకలో 70 అడుగుల గణపతి.. 18 టన్నుల బెల్లంతో..

Jaggery Ganapati: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఎక్కడ పెద్ద విగ్రహాలు పెట్టారు.. ఎక్కడ కాస్త డిఫరెంట్‌ వినాయకుడిని పెట్టారా? అని చూస్తుంటారు.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్‌లో అతిపెద్ద గణపతి కొలువుదీరగా.. ఆ తర్వాత అందరినీ ఆకర్షించేది విశాఖే. ప్రతీ ఏటా వినూత్నంగా వుండేలా ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఆసక్తిని ప్రదర్శి స్తుంటారు నిర్వహకులు. గత ఏడాది వరకు దేవతామూర్తి సైజ్, మండపం డెకరేషన్ల మీదే పోటీ వుండేది. ఈసారి అందుకు భిన్నంగా గణపతిని అలంకరించే విధానంలోనూ డిఫరెంట్ ఆలోచనలకు పదును పెట్టారు. ఇందులో నుంచి రూపుదిద్దుకున్నదే బెల్లం గణపతి. గాజువాక బడ్ డిపో దగ్గర లంబోధర అసోసియేషన్ 70 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహం ఏర్పా టు చేసింది. సుమారు 18 టన్నుల బెల్లం ఇందు కోసం వినియోగించారు.

బెల్లం దిమ్మెలను క్రమపద్ధతిలో అమర్చుతూ భారీ ఆకారాన్ని తీర్చిదిద్దారు. అనకాపల్లికి చెందిన శిల్పులు రెండు నెలలకు పైగా కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందు కోసం అవసరమైన బెల్లం రాజస్ధాన్ నుంచి రప్పించారు. 21 రోజుల పాటు భక్తుల దర్శనాలక అను గుణంగా ఈ మండపం రూపొందింది. స్ధానికంగా లభించే బెల్లం వాతావరణ పరిస్ధితులకు తట్టుకుని నిలబడదని గుర్తించి రాజస్ధాన్ నుంచి తెప్పించారు. అక్కడ తయారయ్యే బెల్లం రాజస్ధాన్ లో వుండే వేడి వాతావరణకు తట్టుకుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ వుంటుంది కనుక ఇంపోర్ట్ చేసుకుని బెల్లంతో ఈ భారీ గణనాథుడిని సిద్ధం చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.. భారీ బెల్లం గణనాథుడు ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే.. అందుకు పాటించిన జాగ్రత్తలు చాలా ప్రధానంగా చెప్పుకోవాలి… గత ఏడాది గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహం కొద్దిరోజులకే ప్రమాద భరితంగా మారింది. దీంతో యంత్రాంగం తక్షణం నిమజ్జనం చెయ్యాలని పట్టుబట్టి ఆ తంతు పూర్తి చేయించింది.. కానీ, ఇప్పుడు గాజువాకలో పోటాపోటీ విగ్రహాలు రెడీ అయ్యాయి. వీటిలో బెల్లం గణపతి బరువు ఎక్కువ. దీంతో నమూనా సిద్ధం చేసిన దగ్గర నుంచి విగ్రహం రెడీ అయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వహకులు చెబుతున్నారు. అటు, గాజువాక శ్రీనగర్ కాలనీలోనూ 100 అడుగుల విగ్రహం రెడీ అయ్యింది.. ఈ సారి చవితి వేడుకల్లో అయోధ్య రామమందిరం, కల్కి, పుష్ప సినిమా హీరోల అవతారంలో వినాయకుడు దర్శనం ఇవ్వనున్నాడు.