Leading News Portal in Telugu

Kishan Reddy: మహిళల భద్రతపై మొసలి కన్నీరు కాదు.. కళ్లు తెరిచి చూడు రాహుల్


  • మహిళల భద్రతపై మొసలి కన్నీరు కాదు.. కళ్లు తెరిచి చూడు రాహుల్- కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో అఘాయిత్యం.. వేధింపుల పర్వం

  • తెలంగాణ జైనూరులో ఆదివాసి మహిళపై జరిగిన అఘాయిత్యం కనిపించలేదా.. ఇదేనా మార్పు..?

  • మహిళలకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ సర్కారు మహిళల భద్రతపై మాట్లాడడం హాస్యాస్పదం- కిషన్ రెడ్డి

  • మహిళల భద్రతపై కాంగ్రెస్ పార్టీకి.. రాహుల్ గాంధీకి వివక్ష తగదు- కిషన్ రెడ్డి.
Kishan Reddy: మహిళల భద్రతపై మొసలి కన్నీరు కాదు.. కళ్లు తెరిచి చూడు రాహుల్

మహిళ భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అవినీతి విషయంలో కళ్ళు తెరిచి చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన గుర్తుకు రాగానే.. నిద్రలోంచి లేచి మహిళలపై అఘాయిత్యాలు దారుణం అని ప్రకటనలు గుప్పించే రాహుల్ గాంధీకి, తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌ లో ఆదివాసీ మహిళపై.. అమానవీయంగా జరిగిన అత్యాచార ఘటన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

మైనారిటీ సంతుష్టికరణ విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. రాహుల్ గాంధీకి జైనూర్ ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ మైనార్టీ కావడంతోనే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఘటన జరిగినా.. తక్షణమే విచారణ జరిపి, నిందితులకు చట్టపరంగా శిక్షపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కాని రాహుల్ గాంధీలా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు నివారిండంలో వివక్ష చూపించడం లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన, జైనూర్‌లో జరిగిన ఘటనను ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలతో పాటు మహిళలపై జరిగే అత్యాచారాల ఘటనలపై రాజకీయాలకతీతంగా ముక్తకంఠంతో ఖండించాల్సింది పోయి.. ఇలా సెలక్టివ్‌గా, ఉద్దేశపూర్వకమైన కేసులపై మాత్రమే మాట్లాడడం రాహుల్ గాంధీకి తగదని అన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని మహిళలపై జరుగుతున్న దాడులు ఘటనల పట్ల వివక్ష చూపరాదని అన్నారు.