- నవ్‌దీప్ సింగ్‌కు గోల్డ్ మెడల్
- అనూహ్యంగా సదేగ్‌పై వేటు
- వేటుకు కారణం ఏంటంటే?

Why Sadegh Beit Sayah Disqualified in Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 29 పతకాలు చేరగా.. పట్టికలో 16వ స్థానంలో కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో భారత అథ్లెట్లు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించారు. శనివారం జావెలిన్ త్రో ఎఫ్41 ఈవెంట్‌లో నవ్‌దీప్ సింగ్‌కు గోల్డ్ మెడల్ వచ్చింది. ముందుగా రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్ రజతం గెలుచుకోగా.. ఇరాన్ అథ్లెట్ సదేగ్ గోల్డ్ గెలిచాడు. అయితే అనూహ్యంగా స్వర్ణం గెలిచిన సదేగ్‌పై వేటు పడడంతో నవ్‌దీప్‌కు స్వర్ణం సొంతమైంది. సదేగ్‌పై ఎందుకు అనర్హత పడిందని అందరూ చర్చించుకుంటున్నారు.
సదేగ్‌పై ఎందుకు అనర్హత పడిందనే దానికి సమాధానం భారత పారా అథ్లెటిక్స్ హెడ్ కోచ్ సత్యనారాయణ తెలిపారు. ‘పారాలింపిక్స్‌లో అథ్లెట్లు రాజకీయ, మతపరమైన నినాదాలు చేయకూడదు. జాతీయ జెండాను తప్ప మరే ఇతర పతాకాలను ప్రదర్శించకూడదు. సదేగ్ తప్పుడు జెండాను చూపి అనర్హతకు గురయ్యాడు. ఇరాన్ అప్పీలుకు వెళ్లినా.. పారాలింపిక్స్ కమిటీ తిరస్కరించింది. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధలను సదేగ్ అతిక్రమించిన కారణంగానే.. నవ్‌దీప్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు మరో స్వర్ణం రావడం ఆనందంగా ఉంది’ అని సత్యనారాయణ తెలిపారు.
సదేగ్ అనర్హతపై పారాలింపిక్స్ కమిటీ ఓ ప్రకటన జారీ చేసింది. ‘ప్రపంచ పారా అథ్లెటిక్స్ చట్టం 8.1 నిబంధనల ప్రకారం జాతీయ జెండాను కాకుండా అథ్లెట్లు మరే ఫ్లాగ్స్‌ను ప్రదర్శించకూడదు. సదేగ్ ఇందుకు విభిన్నంగా వ్యవహరించాడు. ఇలాంటి చర్యలను పారాలింపిక్స్ కమిటీ ఉపేక్షించదు. అథ్లెట్లు సహా కోచ్‌లు, అధికారులు ఎవరైనా నిబంధనలకు లోబడే నడుచుకోవాలి. క్రీడలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలి’ అని పారాలింపిక్స్ కమిటీ పేర్కొంది. పోటీ సమయంలో సదేగ్ తమ జాతీయ జెండాను కాకుండా.. ఎరుపు రంగులో అరబిక్ టెక్స్ట్‌తో కూడిన నల్ల జెండాను ప్రదర్శించినట్లు తెలుస్తోంది.