Leading News Portal in Telugu

Rain Alert: తీరం దాటిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర, ఒడిశాలో భారీ వర్షాలు..!


  • బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది..

  • ఒడిశా.. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం..

  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు..
Rain Alert: తీరం దాటిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర, ఒడిశాలో భారీ వర్షాలు..!

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటేసింది. ఇవాళ (సోమవారం) ఉదయం 11.30 గంటలకు ఒడిశా రాష్ట్రం పూరీ సమీపంలోని గోపాల్‌పుర్‌ దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం మరో 24 గంటల వరకు ఉంటుందని గోపాల్‌పుర్‌ ఐఎండీ అధికారి కేఎస్‌ మూర్తి చెప్పుకొచ్చారు. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే, మాల్కాన్‌గిరిలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ అహూజా భువనేశ్వర్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రిలీఫ్‌ కమిషనర్‌ డీఆర్ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు వచ్చే ఛాన్స్ లేదని పేర్కొన్నారు.

అలాగే, ఈ వాయుగుండం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడి రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీరు కిందకు రిలీజ్ చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 379 అడుగులుగా వద్ద ఉంది. తాండవ జలాశయం వరద రహదారిపై పొంగి ప్రవహిస్తుండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు.