Leading News Portal in Telugu

Budameru Floods: కొల్లేరుకు భారీగా బుడమేరు వరద.. 9 గ్రామాలకు రాకపోకలు బంద్..


  • కొల్లేరుకు భారీగా బుడమేరు వరద..

  • దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు..

  • కొల్లేరు సరస్సులో క్రమంగా పెరుగుతోన్న నీటిమట్టం..

  • పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..
Budameru Floods: కొల్లేరుకు భారీగా బుడమేరు వరద.. 9 గ్రామాలకు రాకపోకలు బంద్..

Budameru Floods: బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.. బుడలేరు వరదకు దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.. ఏలూరు- కైకలూరు రహదారిపై ఆరు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం కొనసాగడంతో కొల్లేరు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కొల్లేరులో నీటిమట్టం క్రమంగా పెరుగుతండడంతో.. స్థానికులతో పాటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

మరోవైపు.. కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతాల్లోని ఆక్వా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బుడమేరు తీసుకొచ్చిన వరకు ఇప్పటికే వేలాది ఎకరాల్లో చెరువులు ముంపు బారిన పడగా మరిన్ని చెరువులకు ముంపు భయం పొంచి ఉంది. ఒక్కో అంగుళం నీటి మట్టం పెరగుతుంటే  కొల్లేరు లంక ప్రాంతాల్లోని ఆక్వా రైతులు హడలిపోతున్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద ఇప్పుడు కొల్లేరు రైతులకు అపార నష్టం తెచ్చిపెడుతోంది తెగిపోయిన బుడమేరు గండ్ల పూడ్చడంతో.. ఆ వరద మొత్తం ఇప్పుడు కొల్లేరుకు చేరుతుంది..