Leading News Portal in Telugu

IND vs BAN: పాపం సర్ఫరాజ్‌.. ఎప్పటివరకు ఆగాలో?! అసలే లేటు ఎంట్రీ


Sarfaraz Khan has no chance of getting a place in Team India: భారత పురుషుల జట్టులో ఎప్పుడూ తీవ్ర పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. జట్టులో సీనియర్ ప్లేయర్స్ ఉండడంతో.. యువ క్రికెటర్లు అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సిరీస్ కోసం ఎంపికైనా.. తుది జట్టులో చోటు దాదాపుగా కష్టమే. ప్రస్తుతం దేశవాళీ సంచలనం సర్ఫరాజ్‌ ఖాన్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది. గత జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన సర్ఫరాజ్‌కు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కే అవకాశాలు లేవు.

దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్ భారీగా పరుగులు చేశాడు. అయినా కూడా భారత జట్టులో చాలా ఆలస్యంగా అవకాశం వచ్చింది. ఇందుకు కారణం సీనియర్ ప్లేయర్స్ ఉండడమే. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు జట్టులో చోటు కోల్పోవడం.. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం.. కేఎల్ రాహుల్ గాయం బారిన పడడం లాంటి కారణాలతో సర్ఫరాజ్‌కు ఏకంగా తుది జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని అతడు రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు చేసి సత్తాచాటాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్‌పై మాజీలు ప్రశంసలు కురిపించారు.

Also Read: Chitra Shukla Pregnancy: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. సీమంతం ఫోటోలు వైరల్!

ఇటీవల ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన భారత్.. చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా బి తరఫున ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్ రాణించాడు. తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసిన అతడు.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో 36 బంతుల్లోనే 46 రన్స్ చేశాడు. దీంతో బంగ్లా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ గాయపడిన సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ జట్టులో ఉండడంతో సర్ఫరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురుకానుంది. బంగ్లాతో టెస్టు సిరీస్‌ అయ్యాక స్వదేశంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. ఆపై ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ ఉంది. కీలక మ్యాచులు ఉన్న నేపథ్యంలో బంగ్లాపై తుది జట్టులో రాహుల్ ఉంటాడడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు సర్ఫరాజ్‌ను దులీప్‌ ట్రోఫీ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఆడాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సర్ఫరాజ్‌ మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే.. ఎప్పటివరకు ఆగాలో? మరి. అసలే లేటు ఎంట్రీ ఇచ్చిన అతడికి సీనియర్లు అడ్డుగా మారారు.