- తీవ్ర ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది..
-
భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. -
54 అడుగులు దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి..

Flood Situation In Godavari: గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు విపరీతంగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుండటంతో దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. భద్రాచలం దగ్గర నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటలకు 48.20 అడుగులుగా నమోదవ్వగా.. ఈ రోజు ఉదయానికి వరద నీటి మట్టం 54 అడుగులు ధాటి ప్రమాదకరంగా గోదావరి ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలోకి 27 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
కాగా, పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అనూహ్యంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 13లక్షల క్యూసెక్కులను దిగువకు రిలీజ్ చేస్తున్నారు. వరద నీరు పట్టిసీమ శివక్షేత్రాన్ని చుట్టుముట్టేసింది. అలాగే, గోదావరి ప్రమాదకరంగా ప్రవాహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలోకి చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముంపునకు అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరిస్తున్నారు. దీంతో పాటు భద్రాచలం దిగువన ఉన్న రహదారుల పైకి వరద నీరు చేరుతుండంతో విలీన మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.