Leading News Portal in Telugu

Minister Narayana: ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్


  • విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ
  • ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ
Minister Narayana: ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్

Minister Narayana: విజయవాడలోని విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి కండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీతో పాటు బుడమేరు ప్రవహించే మార్గాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వరద తగ్గిన చోట సాయంత్రానికి పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు ప్రవాహానికి ఉన్న ఆటంకాలను అధిగమించడంపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు.

10 రోజులపాటు సీఎంతో పాటు మంత్రులు, అధికారులు కష్టపడి వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చారని మంత్రి నారాయణ ప్రశంసించారు. కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వరద తగ్గిపోయిందని వెల్లడించారు. ఐదు ప్రాంతాల్లో సాయంత్రానికి సాధారణ పరిస్థితి తీసుకొస్తామన్నారు. మున్సిపల్ ,పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు వరద సహయక విధుల్లో ఉన్నారని మంత్రి తెలిపారు. బుడమేరు ఉండాల్సిన విస్తీర్ణం కంటే చాలావరకూ కుచించుకుపోయిందన్నారు. ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.