- అజాన్.. నమాజ్ టైంలో దుర్గాపూజా కార్యక్రమాలను నిలిపివేయాలి..
-
హిందూ సంగీతం.. వాయిద్యాల మోతలను ఐదు నిముషాల ముందే ఆపేయాలి.. -
హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం

Bangladesh Govt: అజాన్, నమాజ్ టైంలో దుర్గాపూజా కార్యక్రమాలను నిలిపివేయాలని.. హిందూ సంగీతం, వాయిద్యాల మోతలను ఐదు నిముషాల ముందే నిలిపివేయాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అక్కడి హిందూ కమ్యూనిటీని ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో హిందూ సమాజానికి దుర్గా పూజా అనేది అతి పెద్ద పండగగా కొనసాగుతుంది. అయితే ఇటీవల జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో మళ్లీ హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి సర్కార్ పేర్కొనింది. దీనికి సంబంధించి హోం వ్యవహరాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) ఎండీ జహంగీర్ అలం చౌధురి మాట్లాడుతూ.. నమాజ్, అజాన్ టైంలో దుర్గా పూజా కార్యక్రమాలను ఆపేయాలని, ముఖ్యంగా సంగీత వాయిద్యాలను, సౌండ్ సిస్టమ్స్‌ని స్విచ్ ఆఫ్‌లో ఉంచాలని పూజా కమిటీలకు సూచించినట్లు వెల్లడించారు. దానికి వాళ్లు కూడా అంగీకరించినట్లు పేర్కొన్నారు.
కాగా, మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ ఈ మధ్య చేసిన ఓ ప్రకటనలో మత సామరస్యంతో ప్రజలు ఉండాలని కోరారు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన యూనస్.. మనది మత సామరస్యం కలిగిన దేశం అన్నారు. మత సామరస్యాన్ని ధ్వంసం చేసేందుకు ఎవరూ ట్రై చేయొద్దని తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు.. అలా ఎవరైనా అల్లర్లకి పాల్పడితే వారిని కఠినంగా శిక్షిస్తాం అని తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ చెప్పుకొచ్చారు.