జగన్ కు నో పాస్ పోర్టు.. లండన్ టూర్ క్యాన్సిల్? | jagan london tour cancil| jagan| averse| attend| court| bond| passport
posted on Sep 13, 2024 10:08AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీతయ్యలాంటి వారు. ఎవరి మాటా వినరు. చివరికి ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా ఖాతరు చేయరు. ఎవరిమాటా వినని జగన్ కు సలహాదారులెందుకో మరి అని పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడెందుకీ ప్రస్తావన అనకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి కాదు. దాంతో ఆయనకు డిప్లమేటిక్ పాస్ పోర్టు రద్దైపోయింది.
అయితే పాస్ పోర్టు రెన్యువల్ కు హైకోర్టు అనుమతించింది. జగన్ పాస్ పోర్టును ఆయన కోరిన విధంగా ఐదేళ్ల రెన్యువల్ కు ఆమోదం తెలిపింది. దీంతో జగన్ లండన్ యానానికి అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు. అయితే జగన్ కు ఐదేళ్ల పాస్ పోర్టు కు అనుమతించిన హైకోర్టు.. కింది కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అదీ నిబంధనల ప్రకారం ఆయన స్వయంగా కోర్టుకు వెళ్లి మరీ పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది. అయితే జగన్ ఎవరి మాటా వినే రకం కాదు కదా! అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి వచ్చిన ఆయనకు ఇప్పుడు కోర్టుకు వెళ్లడం చిన్నతనంగా అనిపించింది. అయినా తనపై కేసుల విచారణకే కాదు.. కోడికత్తి కేసులో బాధితుడిగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన కోర్టు మెట్లక్కడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించేందుకు కోర్టుకు వెళ్లేందుకు ఆయన సుతరామూ ఇష్టపడటం లేదు. అందుకే ఆయన పాస్ పోర్టు ఇప్పటికీ రెన్యువల్ కాలేదు. కోర్టు తీర్పు వచ్చి రోజులు గడుస్తున్నా.. ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించలేదు. ఈ లోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఆయన లండన్ పర్యటనకు కారణంగా చెప్పిన కుమార్తె పుట్టిన రోజు అయిపోయింది. దీంతో ఆయన లండన్ యాత్ర రద్దైనట్లేనని భావించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఆయన లండన్ వెళ్లాలన్నా మరో కారణం చూపాలి. మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవాలి. కచ్చితంగా ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కోర్టులో కౌంటర్ అఫడివిట్ దాఖలు చేస్తుంది. మళ్లీ వాదనలు తప్పవు. అప్పుడైనా ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందే. అందుకు ఆయన సుముఖంగా లేరు. దీంతో జగన్ ఇక విదేశీయానం అన్న మాటే ఎత్తకపోవచ్చు.