Leading News Portal in Telugu

MS Dhoni Angry: ధోనీ కోపాన్ని నేను చూశా.. ఒక్కసారిగా బయపడిపోయా: బద్రీనాథ్


  • మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ
  • ధోనీ కూడా మనిషే
  • వాటర్‌ బాటిల్‌ను తన్నితే
MS Dhoni Angry: ధోనీ కోపాన్ని నేను చూశా.. ఒక్కసారిగా బయపడిపోయా: బద్రీనాథ్

Badrinath recalled MS Dhoni’s Angry Moment: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూ.. తన పని చేసుకుంటూ పోతుంటాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏంతో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మైదానంలో సహచర ఆటగాళ్లపై అరిచిన సందర్భాలూ లేవు. అందుకే అతడిని ‘మిస్టర్ కూల్’ అని అంటారు. అయితే ధోనీ ఆగ్రహంను తాను ప్రత్యక్షంగా చూశానని చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ చెప్పాడు. మహీ కోపంలో వాటర్‌ బాటిల్‌ను తన్నితే ఎక్కడో పడిందని తెలిపాడు. తాను బయపడిపోయా అని పేర్కున్నాడు.

తాజాగా ఇన్‌సైడ్‌స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ బద్రీనాథ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ కూడా మనిషే. మహీ కూడా కొన్ని సమయాల్లో తన సంయమనాన్ని కోల్పోతుంటాడు. అయితే మైదానంలో మాత్రం తన కోపాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. కోపం కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో తాను ఇబ్బంది పడుతున్నట్లు ప్రత్యర్థులు భావించకూడదని అతడి భావన. ధోనీ ఆగ్రహాన్ని నేను ప్రత్యక్షంగా చూశా. అది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జరిగింది. చెన్నై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌ అది. 110 పరుగుల లక్ష్య ఛేదనలో మేం వరుసగా వికెట్లను కోల్పోయాం. సునాయాసంగా గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం’ అని చెప్పాడు.

‘అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన నేను ఎల్బీగా అవుట్ అయ్యాను. ఎంఎస్ ధోనీ డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వస్తున్నాడు. నేను డ్రెస్సింగ్‌ రూమ్‌ పక్కనే ఉన్నా. ధోనీ, నాకు మధ్య ఓ చిన్న వాటర్‌ బాటిల్‌ ఉంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న అతడు బాటిల్‌ను గట్టిగా తన్నేశాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నవారంతా మహీ కళ్లల్లోకి చూసేందుకూ కూడా ప్రయత్నించలేదు’ అని ఎస్ బద్రీనాథ్వివరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024లో ఫినిషర్‌గా అభిమానులను అలరించాడు. 8 ఇన్నింగ్స్‌లలో 161 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ 2025లో అతడు ఆడతాడా? లేదో? చూడాలి.