Leading News Portal in Telugu

Leopard Tension: మళ్లీ కనిపించిన చిరుత.. రాజమండ్రిలో కలకలం..


  • రాజమండ్రిలో టెన్షన్ పెడుతోన్న చిరుత..

  • దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో మళ్లీ చిరుత కదలికలు..
Leopard Tension: మళ్లీ కనిపించిన చిరుత.. రాజమండ్రిలో కలకలం..

Leopard Tension: రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు కనిపించాయి. చిరుత పులి ప్రస్తుతం దివాన్ చెరువు అటవీప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.. చిరుతపులి కదలికలను గుర్తించు నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు ఉపయోగిస్తున్నారు. చిరుతని ట్రాప్ బోనులతో పట్టుకొనుటకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరుత పులిని కచ్చితంగా పట్టుకొంటామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. బయట ప్రాంతాల్లో ప్రజల నుండి వచ్చిన సమాచారం తీసుకొని ఫారెస్ట్ సిబ్బంది వెళ్లి తనిఖీ చేయగా ఎటువంటి అధారాలు లభించలేదు. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు నిర్ధారణ లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగించి శోధన చేస్తున్నారు. రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ, ఆటోనగర్ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఏరియాలలో పిల్లలను తల్లిదండ్రులు సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, రాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుత కలకలం సృష్టిస్తోన్న విషయం విదితమే.. చిరుత కదలికలకు సంబంధించిన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. స్థానికులు భయాందోళనకు గురిఅవుతోన్న విషయం విదితమే.