Leading News Portal in Telugu

Road Accident: బీఎండబ్ల్యూ బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు యువతులు!


  • ఇండోర్‌లో దారుణం
  • యువతులను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు
  • స్నేహితుడికి కేక్‌ ఇచ్చేందుకు వెళ్తున్న నిందితుడు
Road Accident: బీఎండబ్ల్యూ బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు యువతులు!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాంగ్‌ రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిపడ్డ యువతులు.. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం లక్ష్మీ తోమర్‌ (24), దీక్ష జాదన్‌ (25)లు ఇండోర్‌లోని ఖజరానా ఆలయాన్ని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మహాలక్ష్మి నగర్‌లో ఎదురుగా దూసుకొచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు.. వీరి స్కూటీని ఢీకొట్టింది. స్కూటీతో సహా ఇద్దరు యువతులు కొన్ని అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌ పారిపోయాడు. ఇద్దరు యువతులకు తీవ్ర గాయాకు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న ఖజ్రానా స్టేషన్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. బీఎండబ్ల్యూ కారు నడిపింది గజేంద్ర ప్రతాప్ సింగ్ (28)గా గుర్తించారు. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ ఇచ్చేందుకు వెళ్తున్నానని, త్వరగా వెళ్లే క్రమంలో రాంగ్‌ రూట్‌లో వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో ప్రతాప్ తెలిపాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.