posted on Sep 16, 2024 11:28AM
కొంతమంది మోసపోవడానికే పుడతారు. పెద్దగా చదువుకోనివారి కంటే, బాగా చదువుకుంటున్నాం… బోలెడంత సంపాదిస్తున్నాం… మోడ్రన్‌గా జీవిస్తున్నాం అంటూ బిల్డప్ ఇచ్చేవారే గోతిలో పడుతున్నారు. ఎంత వెర్రిబాగులవాడు అయినా ఆ రకంగా మోసపోరు గానీ.. బాగా చదువుకున్నవారు, సాఫ్ట్.వేర్ ఇంజనీర్లం అంటూ పోజులు కొట్టేవారు వాళ్ళు మాత్రం చాలా సిల్లీగా మోసపోతున్నారు. ఇలాంటి వార్తలు ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. లేటెస్ట్.గా ఒక సాఫ్ట్.వేర్ ఇంజనీర్ చాలా సాఫ్ట్.గా మోసపోయాడు. అది కూడా సైబర్ మోసం. సంప్రదాయినీ… సుద్దపూసనీ అయిన సదరు సాఫ్ట్.వేర్ ఇంజనీర్ ఎలా మోసపోయాడో తెలుసుకుందాం.
తిరుపతిలో సాఫ్ట్.వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడికి ఈనెల ఐదో తారీఖునాడు కొంతమంది సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేశారు. తమను తాము సైబర్ క్రైమ్ పోలీసులుగా చెప్పుకున్నారు. నువ్వు ఇరాన్‌కి అక్రమంగా వస్తువులు సరఫరా చేశావ్.. ఠాఠ్.. ఠూఠ్.. అన్నారు. ఈ కేసు మీద విచారణ జరపడానికి నువ్వు వెంటనే ముంబై రావాలని చెప్పారు. సర్లేగానీ, నీ బ్యాంక్ ఖాతా వివరాలు, నీ ఫోన్‌కి వచ్చే ఓటీపీ ఇవ్వు అన్నారు. దాంతో ఈ సాఫ్ట్.వేర్ బుద్ధావతారం వాళ్ళు చెప్పినట్టే అన్ని వివరాలూ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ సాఫ్ట్.వేర్ సార్‌కి ఓ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు మా బ్యాంక్ నుంచి 13 లక్షల 80 వేల రుణం తీసుకున్నావనేది ఆ ఫోన్ సారాంశం. దాంతో షాకైపోయిన ఆ సాఫ్ట్.వేర్ సుద్దపూస చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఏం చేస్తారు? కేసు పెడతారు. ఈయన గారు తెలివితక్కువగా మోసపోతే, పోలీసులు తంటాలుపడి ఈయన గారిని రక్షించేసేయాలి. అంతేగా? చదువుకుంటే సరిపోదు…!