Leading News Portal in Telugu

Asian Champions Trophy: ఫైనల్‌కు చేరిన భారత హాకీ జట్టు.. దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలుపు


  • ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరిన భారత్
  • సెమీస్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో భారత్ విజయం.
Asian Champions Trophy: ఫైనల్‌కు చేరిన భారత హాకీ జట్టు.. దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలుపు

భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ-ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించింది. ఫైనల్‌లో భారత్ చైనాతో తలపడనుంది. కాగా.. ఈ టోర్నీలో ఇండియా అద్భుత ప్రదర్శన చేసి అజేయంగా నిలిచింది. రేపు (మంగళవారం) భారత్-చైనాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తోంది. కాగా.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.

దక్షిణ కొరియాపై భారత్‌ ఆరంభంలోనే ఆధిక్యం కనబరిచింది. మొదట ఉత్తమ్ సింగ్ గోల్ చేసి భారత్‌ను 1-0తో ముందంజలో ఉంచాడు. ఆ తర్వాత.. రెండో క్వార్టర్‌లోనూ భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. రెండో క్వార్టర్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్‌ దక్షిణ కొరియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. భారత పురుషుల హాకీ జట్టు మూడో క్వార్టర్‌లోనూ ఆధిక్యాన్ని కొనసాగించింది. దక్షిణ కొరియా హాఫ్ టైమ్ తర్వాత పునరాగమనం చేసి గోల్ కొట్టే ప్రయత్నం చేసినా భారత్‌ను అధిగమించలేకపోయింది. మూడో క్వార్టర్‌లో కొరియా తరఫున జిహున్ యాంగ్ గోల్ చేయగా, భారత్ తరఫున జర్మన్‌ప్రీత్ సింగ్ మూడో గోల్ చేశాడు. ఆ తరువాత, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండవ గోల్ చేశాడు. దీంతో.. దక్షిణ కొరియాపై భారత్ 4-1 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణ కొరియా చివరి వరకు ఆధిక్యం కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు.

అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడడం ఇది 62వ సారి. 1958లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఇరు జట్లు తొలిసారి తలపడ్డాయి. ఆ తర్వాత భారత్ 2-1తో దక్షిణ కొరియాను ఓడించింది. ఇప్పటి వరకు భారత్‌ 39 మ్యాచ్‌లు, దక్షిణ కొరియా 11 మ్యాచ్‌లు గెలుపొందాయి.. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.