Leading News Portal in Telugu

IND vs BAN: అరుదైన రికార్డుపై యశస్వి జైస్వాల్ కన్ను.. కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!


  • సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్
  • అరుదైన రికార్డుపై కన్నేసిన యశస్వి
  • మరో 8 సిక్స్‌లు బాదితే
IND vs BAN: అరుదైన రికార్డుపై యశస్వి జైస్వాల్ కన్ను.. కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!

Yashasvi Jaiswal Record: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ గురువారం ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డును అందుకోనున్నాడు.

డబ్ల్యూటీసీ 2023-25లో యశస్వి జైస్వాల్ మరో 132 పరుగులు చేస్తే ఒక డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పుతాడు. ఈ డబ్ల్యూటీసీలో యశస్వి ఇప్పటివరకు 1028 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అజింక్య రహానే, రోహిత్‌ శర్మ తర్వాత ఓ సింగిల్ ఎడిషన్‌లో వెయ్యికి పైగా రన్స్‌ చేసిన మూడో భారత ఆటగాడిగా నిలుస్తాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో యశస్వి ఈ రికార్డును అందుకునే అవకాశముంది.

2019-21 ఎడిషనల్‌లో అజింక్య రహానె (1159) పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూసుకుంటే డబ్ల్యూటీసీ 2023-25లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (1398) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ (1028)తో కలిసి యశస్వి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో 8 సిక్స్‌లు బాదితే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పుతాడు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్ (33 సిక్స్‌లు, 2014) అగ్ర స్థానంలో ఉన్నాడు. బెన్‌ స్టోక్స్‌ (26 సిక్స్‌లు, 2022), యశస్వి జైస్వాల్ (26 సిక్స్‌లు, 2024) రెండో స్థానంలో ఉన్నారు.