Leading News Portal in Telugu

Donald Trump: వచ్చే వారం ప్రధాని మోడీని కలుస్తా..


  • ఈ నెల 21 నుంచి 23 వరకు అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన..

  • వచ్చేవారం ప్రధాని మోడీతో సమావేశం అవుతానని తెలిపిన డొనాల్డ్ ట్రంప్..

  • భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రసంశలు కురిపించిన ట్రంప్..
Donald Trump: వచ్చే వారం ప్రధాని మోడీని కలుస్తా..

Donald Trump: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. మిచిగాన్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత ప్రధాని మోడీ ఓ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రసంశలు కురిపించారు. అయితే, మోడీతో భేటీకి సంబంధిచిన పూర్తి వివరాలను మాత్రం ఆయన తెలియజేయలేదు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌.. ప్రధాని మోడీతో సమావేశం అవుతానని ప్రకటించటంపై తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక, వచ్చే వారం సెప్టెంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షతను జరగనున్న నాలుగో క్వాడ్‌ సమ్మిట్‌లో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 21వ తేదీన న్యూయార్క్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. 22వ తేదీన న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌’’లో కూడా ప్రధాని ప్రసంగించబోతున్నారు. ఇక, 2020 ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించిన టైంలో డొనాల్డ్ ట్రంప్‌.. ప్రధాని మోడీతో చివరిసారి కలిశారు.