Leading News Portal in Telugu

Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు


  • వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు

  • కీలక ఆధారాలు నాశనం అయ్యేలా చేశారని వెల్లడి
Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తోంది. అంతకముందు కేసు దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు.. సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర సంస్థ దర్యాప్తు చేస్తోంది. అయితే సీబీఐ తాజాగా బెంగాల్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేసింది. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు నాశనం అవ్వడం.. హత్యాచారం జరిగిన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో బెంగాల్‌ పోలీసులు ఆలస్యం చేశారని సీబీఐ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: BC Janardhan Reddy: నితిన్‌ గడ్కరీతో మంత్రి జనార్దన్‌రెడ్డి భేటీ.. ఏపీకి అదనపు నిధులు..!

ఆగస్టు 9న ఆర్ జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. తొలుత ఈ కేసును బెంగాల్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తమవడంతో కోల్‌కతా హైకోర్టు.. కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఇక వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడు సంజయ్‌రాయ్‌ దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఒకవేళ వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఉంటే సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని తెలిపింది. కీలక ఆధారాలు నాశనం చేసే ఉద్దేశంతోనే పోలీసులు విచారణ చేపట్టారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

ఇక ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. పాలిగ్రాఫ్ టెస్ట్, వాయిస్‌ అనాలిసిన్‌ నిర్వహించారు. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన MSME పాలసీ మనది

ఇదిలా ఉంటే వైద్యురాలికి న్యాయం చేయాలంటూ వైద్యులు ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక నెల రోజులుగా వైద్య సేవలు కుంటిపడడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. ఐదు డిమాండ్లకు.. మూడింటికి బెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయినా కూడా డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోసారి సీఎం మమతతో చర్చలకు డాక్టర్లు సిద్ధపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్ లవ్ జీహాద్.. బీజేపీ నేత సంచలనం!!