Leading News Portal in Telugu

Minister Anam Ramanarayana Reddy: ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..


  • తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని వెల్లడి
Minister Anam Ramanarayana Reddy: ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..

Minister Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డిపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు.

గత ప్రభుత్వం 2022 లో టెండర్లు మార్చారని, మూడు సంవత్సరాల అనుభవం ఉండాల్సిన కంపెనీలకు ఒక సంవత్సరానికి తగ్గించారని మంత్రి తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ప్రక్రియను కూడా అప్పట్లో తీసేశారని వ్యాఖ్యానించారు. నిబంధనలను పట్టించుకోకుండా టెండర్లను పిలిచారన్నారు. అధికారం కోసం.. బాబాయి దోపిడి కోసం హిందువుల మనోభావాలను దెబ్బ తీసి.. ఏమీ ఎరగనట్టు ప్రధాన మంత్రికి జగన్ ఒక ఉత్తరం రాశాడని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తాను వేసిన టీటీడీ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. చంద్రబాబు అధికారాన్ని ప్రశ్నించే హక్కు జగన్‌కు ఎవరు ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు.