Leading News Portal in Telugu

Pawan Kalyan Deeksha: మెట్ల మార్గంలో తిరుమలకు పవన్‌ కల్యాణ్‌.. అక్కడే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ


  • ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

  • తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన దీక్ష విరమణ..

  • నడకమార్గంలో తిరుమల చేరుకోనున్న పవన్..
Pawan Kalyan Deeksha: మెట్ల మార్గంలో తిరుమలకు పవన్‌ కల్యాణ్‌.. అక్కడే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

Pawan Kalyan Deeksha: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టిన విషయం విదితమే.. అయితే, తిరుమలలోనే దీక్ష విరమించేందుకు సిద్ధం అవుతున్నారు పవన్‌ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమల చేరుకోనున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న ఆయన.. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు.

కాగా, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి రావడంతో.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి విదితమే. 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమించనున్నారు.. 2వ తేదీన తిరుమల కొండపై ఉంటారు పవన్‌ కల్యాణ్.. ఇక, 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చర్చగా మారగా.. దీక్ష విరమించిన తర్వాత నిర్వహించే వారాహి సభ వేదికగా.. గత ప్రభుత్వంపై పవన్ కల్యాణ్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..