Leading News Portal in Telugu

Senegal Migrants: సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం.. పడవలో 30 మృతదేహాలు!


  • డాకర్ తీరంలో తీవ్ర విషాదం
  • పడవలో 30 మృతదేహాలు
  • మృతదేహాలను గుర్తించలేకపోతున్న అధికారులు
Senegal Migrants: సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం.. పడవలో 30 మృతదేహాలు!

పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌ రాజధాని డాకర్ తీరంలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. డాకర్ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు అన్ని కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని సెనెగల్‌ మిలిటరీ ప్రతినిధి ఇబ్రహీమా సౌ ఒక ప్రకటనలో తెలిపారు. పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కునే దిశగా విచారణను ముమ్మరం చేసినట్ల తెలిపారు.

సెనెగల్‌ నౌకాదళానికి ఆదివారం సాయంత్రం ఓ పడవ గురించి సమాచారం అందింది. డాకర్ నుండి 70 కిలోమీటర్ల (38 నాటికల్ మైళ్లు) దూరంలో ఉన్న ప్రాంతానికి పెట్రోలింగ్‌ బోట్‌ను పంపారు. పెట్రోలింగ్‌ బోట్‌ అధికారులు పడవను చెక్ చేయగా.. 30 మంది మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారిని గుర్తించలేకపోయారు. పడవ ఎక్కడి నుంచి వచ్చిందో అనే వివరాలను సెనెగల్‌ మిలిటరీ అధికారులు కనుకునే పనిలో ఉన్నారు.

ఈ నెల ప్రారంభంలో సెనెగల్ తీరంలో 89 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. అందులో 37 మంది మరణించారు. ఘర్షణలు, పేదరికం, ఉద్యోగాల కొరత వంటి కారణాలతో.. పశ్చిమ ఆఫ్రికా నుంచి వేలాది మంది వలసదారులు సెనెగల్ ద్వారా విదేశాలకు అక్రమంగా వలస వెళుతున్నారు. చాలామంది స్పెయిన్‌కు చెందిన కానరీ దీవులకు వెళుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 22300 మందికి పైగా వలసదారులు కానరీ దీవులకు వెళ్లారట. వలసదారులు పడవలో వెళుతుండగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.