- ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం..
-
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీల చించివేత.. -
రేపు జనసేనలో చేరనున్న బాలినేని.. -
బాలినేనిని జనసేనలోకి స్వాగతిస్తూ ఫ్లెక్సీలు.. -
చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. జనసేన ఆగ్రహం..

Balineni Flexes Removed: ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం రేగింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. అయితే, ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఇప్పటికే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిగిన బాలినేని.. రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు.. ఇక, బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బాలినేని అభిమానులు.. కానీ, తెల్లవారేసరికి నాలుగైదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.. అయితే, జనసేన ఫ్లెక్సీల చింపివేతపై ఆ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి సంస్కృతి మంచిది కాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..
ఇక, ఎస్పీకి ఫ్లెక్సీల చింపివేత వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు జనసేన నేతలు.. ఇటీవలే బాలినేనిని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలను పెట్టడంపై అభ్యతరం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు.. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించారు.. ఎవరిని అడిగి మా ఫొటోలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాజాగా మరోసారి ఇదే తరహాలో పలుచోట్ల ఫ్లెక్సీలు చింపివేతతో ఒంగోలు నగరంలో చర్చనీయాంశంలా మారింది ఫ్లెక్సీల వ్యవహారం.