R. Krishnaiah: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సమావేశం అయ్యారు. విద్యా నగర్లోని కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఎంపీ రవి, కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు చెప్పుకొచ్చారు. బీసీ సంక్షేమ సంఘం కమిటీ, తన అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తెలియజేస్తానని కృష్ణయ్య చెప్పినట్లు తెలుస్తుంది. కాగా, ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్. కృష్ణయ్య మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మీడియా సమావేశంలో కృష్ణయ్య ఏ ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది.
Read Also: HYDRA Demolition: మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు.. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఫోకస్..!
అయితే, జాతీయ స్థాయిలో బీసీ కుల గణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్ల నిర్ణయం తీసుకున్నట్లు ఆర్. కృష్ణయ్య చెప్పారు. బీసీ ఉద్యమం గ్రామస్థాయికి చేరిందని.. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పెంపును సాధించడానికి ఆందోళలను ఉధృతం చేస్తామన్నారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం వాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పుకొచ్చింది. ఇక, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయగానే భారతీయ జనతా పార్టీలో చేరాలని కోరింది. జాతీయ స్థాయిలో కీలక పదవి కూడా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.