posted on Sep 25, 2024 2:08PM
నటుడిగా ప్రకాశ్ రాజ్ ఎంత ప్రసిద్ధుడో.. తన వ్యవహార శైలితో అంతటి వివాదాస్పదుడు. ఆయన రాజకీయాలు కూడా విలక్షణంగా ఉంటాయి. ఆయన రాజకీయంగా ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారన్నది ఎవరూ ఊహించలేరు. ప్రధాని మోడీపై వ్యతిరేకత అన్న ఏకైక అజెండాతో కొంత కాలం హడావుడి చేశారు. ఆ తరువాత మౌనం వహించారు. ఆ తరువాత అంటే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ జెండా పట్టుకున్నారు. ఎన్నికలలో బీజేపీ పరాజయం తరువాత ఆయన రాజకీయంగా పూర్తిగా మౌనం వహించారు. ఇప్పుడు తాజాగా తిరుమల లడ్డూ వివాదంలో జనసేనానితో ఢీ అనడానికి రెడీ అయిపోయినట్లు కనిపిస్తున్నారు.
ఇక్కడే ఈ వివాదం నుంచి బయటపడేయగల వ్యక్తి ప్రకాశ్ రాజ్ ఒక్కరే అని వైసీపీ భావిస్తోంది. ఎందుకంటే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పును చంద్రబాబుపైకి, తెలుగుదేశం పార్టీపైకీ నెట్టేయడానికి వైసీపీ చేసిన అన్ని ప్రయత్నాలూ ఘోరంగా విఫలమయ్యాయి. జగన్ ప్రధానికి లేఖ రాసి ఈ రొచ్చులోకి బీజేపీనీ, కేంద్రాన్ని లాగుదామని చేసిన ప్రయత్నం విఫలమైంది. తాను ప్రధానికి రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసి జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన పార్టీల అధినేతలకూ ట్యాగ్ చేసుకున్నా పట్టించయుకున్న నాథుడు లేకుండా పోయాడు. లడ్డూ వివాదం వైసీపీ ఉనికికే ముప్పు తెచ్చేలా తయారైంది. వైసీపీలో రోజా, వైవీ, భూమన, అంబటి వంటి నేతలు వినా మరెవరూ లడ్డూ వివాదం విషయంలో పార్టీకి మద్దతుగా నిలిచేందుకు ముందుకు రావడం లేదు సరికదా.. పార్టీ నుంచి బైటపడేందుకు ఇదే తరుణం అన్నట్లుగా భావిస్తున్నారు. ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. మరో నలుగురైదురుగు వైసీపీ రాజ్యసభ సభ్యులు అదే దారిలో ఉన్నారని అం టున్నారు. సరిగ్గా ఈ తరుణంలో వైసీపీకి ప్రకాష్ రాజ్ ఆపద్బాంధవుడిగా కనిపిస్తున్నారు.
ఎందుకంటే జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటూ చేసిన ప్రతిపాదనను తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. లడ్డూ కల్తీని జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నం మాని కల్తీకి బాధ్యులను శిక్షించడంపై దృష్టి పెట్టాలంటూ ఆయన చేసిన సూచన.. అందుకు ప్రతిగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వారిరువురి మధ్యా వాగ్యుద్ధాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని వైపీపీ ప్రయత్నిస్తున్నది. ఇందుకే దీనిని పెద్ద అంశంగా మార్చేం దుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగిపోయారు.
ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా మీడియా మందుకు వచ్చేశారు. ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ పవన్ ను గట్టిగా ఎదుర్కొని నిలబడతారనీ, అది తమకు సానుకూలంగా మార్చుకోవాలని తపన పడుతున్న వైసీపీకి ప్రస్తుతం ఆయన విదేశాలలో ఉండటం.. వచ్చిన తరువాతే మాట్లాడతానని అనడం ఇబ్బందిగా మారింది. ఆయన వచ్చే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందన్న గాభరా మొదలైంది. దీంతో ప్రకాశ్ రాజ్ ను సంప్రదించి విదేశాల నుంచే పవన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. అయితే అందుకు ప్రకాశ్ రాజ్ తిరస్కరించారనీ, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యికి బాధ్యులను శిక్షించాలన్నదే తన డిమాండ్ అని తేల్చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.