Leading News Portal in Telugu

Same Gender marriage: థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహాలను చట్టబద్ధత..


  • స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం నిర్ణయం..

  • వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్‌ రాజు మహా వజ్రలాంగ్‌ కర్ణ్‌ సంతకం..

  • బిల్లుకు థాయ్ రాజు ఆమోద ముద్ర వేయడంలో ఆనందం వ్యక్తం చేసిన ఎల్జీబీటీక్యూలు
Same Gender marriage: థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహాలను చట్టబద్ధత..

Same Gender marriage: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు వీలు కల్పించేలా చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్‌ రాజు మహా వజ్రలాంగ్‌ కర్ణ్‌ తాజాగా సంతకం పెట్టారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన ప్రథమ దేశంగా థాయ్‌లాండ్‌ నిలిచింది. కాగా, 2025 జనవరి 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతుందని థాయ్ లాండ్ సర్కార్ ప్రకటించింది. దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త లాంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు ఉపయోగించనున్నారు.

ఇక, స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభించనున్నాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కు (ఎల్జీబీటీక్యూ)లకు థాయ్‌లాండ్‌లో మొదటి నుంచీ స్వేచ్ఛ ఎక్కువేనే ఉంది. అయితే, పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్లు గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే, సంబంధిత బిల్లు జూన్‌లో సెనేట్‌ ఆమోదం పొందినప్పటికి.. మంగళవారం రాజు ఆమోదం తెలిపడంతో అది చట్టరూపం దాల్చింది.

కాగా, ఇది చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నామని స్వలింగ సంపర్కులు అంటున్నారు. సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయమిదని ఎల్జీబీటిక్యూ హక్కుల కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్న చుమాపోన్‌ పేర్కొన్నారు. చట్టం అమల్లోకి రావడంతో 2025 జనవరి 22వ తేదీన 1,000కి పైగా ఎల్జీబీటీక్యూ జంటలకు సామూహిక పెళ్లిలు చేసుకునే యోచన ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, తైవాన్, నేపాల్‌ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడవ దేశంగా థాయ్‌లాండ్‌ నిలిచింది. తైవాన్‌ 2019లో తొలిసారి ఈ బిల్లుకు ఆమోదం తెలపగా.. ఆ తర్వాత నేపాల్‌ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అమలు జరుగుతుంది.. ఇప్పుడు థాయ్ లాండ్ లో కూడా స్వలింగ వివాహాల బిల్లుకు ఆమోదం దొరికింది.